ఎమ్యెల్యే జోగు రామన్నపై ఎంపీ సోయం బాపూరావు ఫైర్

01-01-2020 Wed 18:36
  • రామన్న అనవసర విమర్శలు చేస్తే ఊరుకోను
  • తలుచుకుంటే ఎమ్మెల్యే జోగు రామన్నకు టికెట్ రాకుండా చేస్తా
  • సీసీఐను పున:ప్రారంభించడంలో టీఆర్ఎస్ విఫలమైంది

రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించలేకపోయిందని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. స్థానిక టీఆర్ఎస్ శాసన సభ్యుడు జోగు రామన్న ఈ విషయంలో ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సోయం బాపూరావు ఈ రోజు సీసీఐ భూ నిర్వాసితుల రిలే దీక్షను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న వైఖరిని తూర్పారబట్టారు. జోగు రామన్న తనపై అనవసర విమర్శలు చేస్తే ఊరుకోమని చెప్పారు. తాను తలుచుకుంటే ఎమ్మెల్యే జోగు రామన్నకు టికెట్ రాకుండా చేస్తానని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని సోయం వెల్లడించారు. భూ నిర్వాసితులతో కలిసి ప్రధాని మోదీకి దీనిపై నివేదిస్తామన్నారు.