ఫోన్లో మాట్లాడుతూ.. భవనం పైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం

25-12-2019 Wed 06:59
  • సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ చదువుతున్న అఖిల్
  • హాస్టల్ భవనం పైనుంచి పడడంతో తీవ్ర గాయాలు
  • కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

బ్రష్ చేసుకుంటూ సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం పైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో జరిగిందీ ఘటన. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అఖిల్ కుమార్ జేఎన్‌టీయూలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. నిన్న ఉదయం 8:30 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనంపై నడుస్తూ బ్రష్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.  

సెలవు కారణంగా నిన్న కాలేజీ వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో అఖిల్‌ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.