టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై

06-12-2019 Fri 19:36
  • పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా సమర్పణ
  • వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానన్న బీద
  • మస్తాన్ రావు వైసీపీలో చేరతారని వార్తలు!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. ఈ రోజు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపించారని తెలుస్తోంది. రాజీనామాకు స్పష్టమైన కారణం వెల్లడించనప్పటికీ.. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారని సమాచారం.

ఇటీవల మస్తాన్ రావు వైసీపీలో చేరతారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో టీడీపీకి ఆయన రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత ఊపునిస్తోంది. రేపు ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. తాను వైసీపీలో చేరుతున్న వార్తను మస్తాన్ రావు ఇంకా ధ్రువీకరించలేదు.