Tourists: భారత్ లో ఒంటరిగా తిరగొద్దు...తమ దేశ మహిళలకు అమెరికా, బ్రిటన్ హెచ్చరిక!

  • దిశ ఘటన నేపథ్యంలో సూచనలు 
  • వంద నంబర్ ఫీడ్ చేసుకోండి 
  • సంప్రదాయ దుస్తుల్లోనే తిరగాలి

అప్పట్లో నిర్భయ ఘటన... తాజాగా హైదరాబాద్ లో దిశ హత్యోదంతం...ఈ రెండు ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. అందుకేనేమో అమెరికా, బ్రిటన్‌ దేశాలలోని పర్యాటక సలహాదారులు తమ దేశ మహిళా టూరిస్టులకు ఓ హెచ్చరిక జారీచేశారు. భారత్ లో పర్యటించే సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు.

ముఖ్యంగా భారత్ లోని బీచ్ లు, ఇతర సందర్శక స్థలాల్లో ఒంటరిగా తిరగవద్దని కోరారు. భారత్ లో పర్యటించే సమయంలో తమ సెల్ ఫోన్లో తప్పనిసరిగా వంద నంబర్ ను ఫీడ్ చేసుకుని ఉంచుకోవాలని, 1091, 1096 నంబర్లను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. ఆపద వస్తే తక్షణం ఈ ఫోన్లకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.

మహిళల వస్త్రధారణ విషయంలోనూ కొన్ని సూచనలు చేశారు. వీలైనంత వరకు అక్కడి సంప్రదాయ దుస్తులనే ధరించడం మంచిదని సూచించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా వంటి దేశాల పర్యటనకు తమ దేశీయులు వెళితే అక్కడి ఉగ్రమూకల ప్రమాదం దృష్ట్యా ఈ ప్రభుత్వాలు ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. తాజాగా భారత్ లో పర్యటన సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోమనడం 'దిశ' ఘటన నేపథ్యంలోనే అని భావిస్తున్నారు.

More Telugu News