Mann Ki Baat: ఎన్ని రోజుల్లోనో చెప్పలేను గానీ... దేశమంతా గర్వపడేలా అయోధ్య తీర్పు: నరేంద్ర మోదీ

  • నవంబర్ 12న గురు నానక్ 550వ ప్రకాశ్ ఉత్సవాలు
  • అయోధ్యపై రానున్న తీర్పు ప్రజలను ఆనందింపజేస్తుంది
  • న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేలా ఉంటుంది
  • 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ

దీపావళి పండగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, ప్రజలందరికీ తన శుభాకాంక్షలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జాతిని ఉద్దేశించి, ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా 'మన్ కీ బాత్'ను మోదీ వినిపించారు. దీపావళి పండగ, భారత సంస్కృతిలో భాగమని అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, తక్కువ కాలుష్యాలు వెదజల్లే టపాకాయలను ఎంచుకోవాలని సూచించారు.

మహిళా సాధికారత దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలని తాను గత 'మన్ కీ బాత్'లో కోరిన తరువాత వేలాది మంది స్పందించారని తెలిపారు. నవంబర్ 12న గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల 85 దేశాల ప్రతినిధులు ఢిల్లీ నుంచి అమృతసర్ కు ప్రయాణించి, గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారని, వారంతా భారత సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో కొనియాడారని మోదీ వ్యాఖ్యానించారు. వారంతా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిపారు.

ఇదే సమయంలో అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ప్రజలు మరువరాదని, ఉక్కు మనిషిగా జాతిని ఏకం చేసిన ఘనత ఆయనదేనని వ్యాఖ్యానించారు. ఆయన ఆలోచనలా విధానాలు, ప్రణాళికల కారణంగానే ఇండియా ఇప్పుడిలా ఉందని అభిప్రాయపడ్డారు. భారతావనికి తొలి హోమ్ మంత్రిగా, హైదరాబాద్, జూనాగఢ్ వంటి సంస్థానాలను ఇండియాలో విలీనం చేయించిన ఆయనకు మరోసారి నివాళులు అర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇదని మోదీ అన్నారు. అందుకే ప్రతి యేటా అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్నామని అన్నారు.

అయోధ్య, రామజన్మభూమి వివాదాన్ని ప్రస్తావించిన మోదీ, 2010, సెప్టెంబర్ లో ఈ కేసు విషయమై అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. ఆపై సుప్రీంకోర్టులో 9 సంవత్సరాల పాటు వాదనలు జరిగాయని, త్వరలోనే తీర్పు వెలువడుతుందని అన్నారు. దేశంలోని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సుప్రీం తీర్పు ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. ఈ తీర్పు ఐదు రోజుల్లో వస్తుందా? ఏడు రోజుల్లో వస్తుందా? పది రోజుల్లో వస్తుందా? చెప్పలేనని, అయితే, తీర్పు కోట్లాది మందికి ఆనందాన్ని కలిగిస్తుందని, దేశంలో ఆశ్చర్యపరిచే మార్పును కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పు రాజకీయనాయకులు, న్యాయ వ్యవస్థ గర్వపడేలా ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు.

More Telugu News