Gujarath: ప్రియురాలికి తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని పరీక్ష పెట్టాడు.. చిక్కుల్లో పడ్డాడు!

షార్ట్స్‌లో చూడండి
ప్రియురాలికి తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకునేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ప్రస్తుతం జైలులో తీరిగ్గా ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మేహుల్ జోషీ (23), ప్రియురాలు ఇషాతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసే ఉంటున్నప్పటికీ ఆమె తనను ఎంతెలా ప్రేమిస్తోందో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ చక్కని ప్లాన్ రూపొందించాడు.  

ప్రణాళికలో భాగంగా ఓ రోజు ఇంటి నుంచి ఆఫీసుకని బయలుదేరిన జోషి.. తన ఫోన్‌లో ఓ కొత్త సిమ్ వేసుకుని వాయిస్ చేంజ్ యాప్ ద్వారా ఇషాకు ఫోన్ చేశాడు. తాము కిడ్నాపర్లమని, జోషి ఇప్పుడు తమ వద్ద బందీగా ఉన్నాడని, అతడిని విడిపించాలంటే కొంత మొత్తం ఇవ్వాలంటూ లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో నిజమేనని భావించిన ఇషా భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్ ద్వారా కిడ్నాపర్లు గాంధీధామ్‌లోని ఓ లాడ్జీలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో లాడ్జీ నుంచి బయటకు వచ్చిన జోషీ బస్టాండ్‌లో నిల్చున్నాడు. వెంబడించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు. ఇషాకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పాడు. దీంతో పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు.
Go Back to Shorts
Gujarath
Lover
kidnap
Police

More Telugu News