ఇంత మాయ చేస్తారు కనుకనే మీరు గౌరవనీయ ఏ-1 కాగలిగారు: సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు

20-10-2019 Sun 13:36
  • ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు!
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామన్నారుగా
  • మరి, రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి?

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వైసీపీ అధికారంలోకి వచ్చాక సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. ‘జగన్ అనే నేను అంటూ కోతల రాయుడుగారు ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండి’ అంటూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ప్రస్తావించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామని ఆనాడు చెప్పారని, ఇప్పుడేమో, ఐదు నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి? కోతకు గురైన రూ.836 కోట్లను ఇంకో నెలలో ఇచ్చేసి మాట నిలబెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. అయినా, టీడీపీ హయాంలోనే 6.49 లక్షల మందికి, రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేశామని గుర్తుచేశారు. వైసీపీ వేసిన కోర్టు కేసుల మూలంగా టీడీపీ ఇవ్వలేకపోయిన ఆ రూ.336 కోట్ల నుండే రూ.264 కోట్లు ఇస్తూ ఇంకా రూ.72 కోట్లను మిగుల్చుకున్నారని, ఇంత మాయ చేస్తారు కనుకనే జగన్ ‘గౌరవనీయ ఏ-1 కాగలిగారు’ అని ఆరోపించారు.