East Godavari District: దేవీపట్నం చేరుకున్న స్కూబా డైవర్లు... బోటు మునిగిన కచ్చులూరు వద్దకు ప్రయాణం

  • తొలుత ఘటనా స్థలికి డైవర్లను అనుమతించని పోలీసులు
  • వారితో వాగ్వాదానికి దిగిన రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం
  • పోర్టు అధికారి అనుమతితో సమస్య పరిష్కారం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంకు విశాఖ నుంచి స్కూబా డైవర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన ‘రాయల్‌ వశిష్ట’ బోటు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో, దాన్ని వెలికి తీయాలంటే స్కూబా డైవర్ల అవసరం ఉందని రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం అధికారులకు తెలియజేసిన విషయం తెలిసిందే. సత్యం సూచన మేరకు అధికారులు విశాఖలోని డైవర్లతో మాట్లాడారు. వారు ఈరోజు ఉదయం దేవీపట్నం చేరుకున్నారు. అయితే డైవర్లను కచ్చులూరు పంపే విషయంలో ధర్మాడి సత్యం, పోలీసుల మధ్య వివాదం నెలకొంది. ఉన్నతాధికారుల అనుమతి లేదంటూ పోలీసులు డైవర్లను ఘటనా స్థలి అయిన కచ్చులూరుకు పంపేందుకు నిరాకరించారు.

అధికారుల అనుమతితోనే డైవర్లను రప్పిస్తే, మళ్లీ ఇదేం తిరకాసని సత్యం పోలీసులతో వాదనకు దిగాడు. పని ముందుకు వెళ్లాలంటే తక్షణం డైవర్లు కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఇరువర్గాల మధ్య వాదనతో వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ జోక్యం చేసుకుని డైవర్లను ఘటనా స్థలికి పంపించేందుకు అనుమతించి, బోటు ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయింది.

కాగా, నాలుగు రోజులుగా సత్యం బృందం బోటు వెలికితీసేందుకు  చేస్తున్న ప్రయత్నాలు అందినట్టే అంది చేజారుతున్నాయి. దీంతో డైవర్లను నేరుగా బోటు వద్దకు పంపి సరైన ప్రదేశంలో బోటుకు లంగర్లు తగిలిస్తే వెలికితీత సులువవుతుందన్నది సత్యం బృందం ఉద్దేశం. ఇప్పుడు డైవర్లు కూడా వచ్చినందున వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

More Telugu News