అప్పటి వరకూ ర్యాంప్ వాక్... క్షణాల్లో పోయిన ఎంబీఏ విద్యార్థిని ప్రాణం!

20-10-2019 Sun 06:54
  • బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన
  • ప్రాక్టీస్ అనంతరం మాట్లాడుతూ కుప్పకూలిన షాలిని
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి
అప్పటివరకూ స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఓ విద్యార్థిని క్షణాల్లో స్పృహ తప్పి మరణించిన ఘటన బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి పీన్యాలో ఎంబీఏ తొలి సంవత్సరం చదువుతున్న షాలినీ (21) అనే యువతి, కాలేజ్ ఫ్రెషర్స్ డేలో భాగంగా ర్యాంప్ వాక్ చేయాలని నిర్ణయించుకుంది. కాసేపు ప్రాక్టీస్ చేసిన ఆమె, ఫ్రెండ్స్ పక్కన నిలబడి, వారితో మాట్లాడుతూ, ఉన్నట్టుండి కుప్పకూలింది.

దీంతో ఆందోళనకు గురైన తోటి విద్యార్థినులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే షాలిని మరణించిందని వైద్యులు తేల్చారు. ఆమె ర్యాంప్ వాక్ ప్రాక్టీస్, కుప్పకూలిన ఘటనలు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదుకాగా, పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి, కేసు దర్యాఫ్తు ప్రారంభించారు.