గవర్నర్ హామీ.. సమ్మె విరమించిన తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు

20-10-2019 Sun 06:38
  • సమస్యల పరిష్కారానికి సమ్మె చేపట్టిన డ్రైవర్లు
  • మంగళవారం వరకు సమయం ఇవ్వాలని కోరిన గవర్నర్ 
  • ఆ రోజు వరకు వేచి చూస్తామన్న జేఏసీ నేతలు

డిమాండ్ల సాధన కోసం తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన సమ్మెను శనివారం రాత్రి విరమించారు. గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం క్యాబ్ డ్రైవర్ల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మంగళవారం వరకు తనకు సమయం ఇవ్వాలని గవర్నర్ కోరారని తెలిపారు. ఆర్టీసీ సమ్మె మూలంగా జనం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, ఇదే సమయంలో క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె చేస్తే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గవర్నర్ తమతో అన్నారని పేర్కొన్నారు.

సమస్య పరిష్కారానికి గవర్నర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే సమ్మెను విరమిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. మంగళవారం కూడా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే అప్పుడు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.