Thailand: థాయిలాండ్ లో దుర్మరణం చెందిన ఇండియన్ టెక్కీ

  • రోడ్డు ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయిన ప్రగ్య 
  • ఫుకెట్ లోని పాటాంగ్ ఆసుపత్రిలో మృతదేహం
  • బెంగళూరులోని రూమ్మేట్ కు సమాచారం

థాయిలాండ్ లో భారతీయ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రగ్య పాలీవాల్ (29) దుర్మరణం పాలయ్యారు. అక్కడ చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్న ఆమె... హాంగ్ కాంగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫుకెట్ లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్ లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. ప్రగ్య కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో ఉంటోంది.

ప్రగ్య మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్ కు థాయిలాండ్ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్య కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

మరోవైపు ఆమె తల్లిదండ్రులకు థాయిలాండ్ వెళ్లడానికి పాస్ పోర్టు కూడా లేకపోవడం కలచివేస్తోంది. ప్రగ్య మరణ వార్తను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది... ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి కమల్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆమె కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చతుర్వేది మాట్లాడుతూ, కారు యాక్సిడెంట్ లో ప్రగ్య మరణించిన విషయాన్ని ఆమె రూమ్మేట్ తెలిపిందని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ప్రగ్య మృతదేహం ఫుకెట్ లోని పాటాంగ్ ఆసుపత్రిలో ఉందని తెలిపారు.

బ్యాంకాక్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ప్రగ్య కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, థాయిలాండ్ లో ఉన్న మన ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఆమె కుటుంబీకులకు వెంటనే పాస్ పోర్టును ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా స్పందించారు. ప్రగ్య కుటుంబానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఆమె కుటుంబీకులు థాయిలాండ్ వెళ్లాలనుకుంటే... తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ కష్టకాలంలో తాము ప్రగ్య కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆమె మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

More Telugu News