India: పాకిస్థాన్ కు మరో షాక్... నిజాం సంపదపై వారసులకు అనుకూలంగా బ్రిటన్ కోర్టు కీలకతీర్పు!

  • 1948లో ఒక మిలియన్ పౌండ్ల సొమ్మును బ్రిటన్ కు పంపిన నిజాం
  • ఆ సొమ్ము తమకే చెందాలని పాక్ వాదన
  • నిజాంకు ఆయుధాలు సరఫరా చేశామని వెల్లడి
  • పాక్ కు ఈ నగదుపై హక్కులేదని తేల్చిచెప్పిన కోర్టు

ఇటీవల కాలంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఏదీ కలిసిరావడంలేదు. ఐక్యరాజ్యసమితిలోనూ, అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ భారత్ వాదనలకే మొగ్గు కనిపిస్తోంది. తాజాగా, 70 ఏళ్ల నాటి నిజాం సంపద కేసులో కూడా పాక్ కు పరాభవం తప్పలేదు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే... 1948లో 7వ నిజాం పేరు మీద లండన్ లోని ఓ బ్యాంకులో ఒక మిలియన్ పౌండ్ల నగదు (ఇప్పుడీ మొత్తం సుమారు రూ 300 కోట్లు అయింది) డిపాజిట్ అయింది. నిజాం అప్పట్లో బ్రిటన్ లో పాక్ రాయబారి హబీబ్ ద్వారా ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయించారు.

అయితే ఆ నగదు తమకే చెందుతుందని నిజాం వారసులు ముఖరం ఝా, ముఫకం ఝా వాదిస్తుండగా, అప్పట్లో తాము నిజాంకు ఆయుధాలు సరఫరా చేశామని, అందువల్ల ఆ సొమ్ము తమకే చెందాలని పాకిస్థాన్ వాదిస్తోంది. ఈ కేసులో నిజాం వారసులకు భారత్ దన్నుగా నిలిచింది. గత 70 ఏళ్లుగా ఈ కేసు హైకోర్టు ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో విచారణలో ఉంది. హబీబ్ కూడా నిజాం తనపై నమ్మకంతోనే ఆ నగదు పంపారని గతంలోనే చెప్పారు.

ఎన్నో దశాబ్దాల పాటు సాగిన విచారణలు, వాదోపవాదాల దరిమిలా బుధవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సంపద నిజాం వారసులకే చెందాలని, పాక్ కు దీనిపై హక్కు లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో ఉన్న ఈ నగదు త్వరలోనే నిజాం వారసుల పరం కానుంది.

More Telugu News