Al qaeda: అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లో విధ్వంసం సృష్టించండి.. ముస్లింలకు అల్ ఖాయిదా పిలుపు!

షార్ట్స్‌లో చూడండి
ఉగ్రసంస్థ అల్ ఖాయిదా మరోసారి అమెరికా, పశ్చిమ దేశాలపై నిప్పులు చెరిగింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు నిన్నటితో 18 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు, యూరప్, ఇజ్రాయెల్ లపై దాడులకు దిగాలని ముస్లింలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు అల్ ఖాయిదా అధినేత అల్ జవహరి ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. అందులో 9/11 ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని వదిలేసినవారిపై జవహరి విమర్శించారు. అమెరికా మిలటరీనే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా వారి సైనిక స్థావరాలు ఉన్నాయని గుర్తుచేశాడు.

గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ కు చెందినదిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తించడంపై జవహరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దురాక్రమణకు ప్రతీకారంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని పిలుపునిచ్చాడు. అమెరికా నేవీ సీల్స్ బలగాలు పాక్ లోని అబోటాబాద్ లో 2011లో అల్ ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చింది.

దీంతో ఈ ఉగ్రసంస్థలో నంబర్ 2గా ఉన్న అల్ జవహరి అధినేతగా బాధ్యతలు స్వీకరించాడు. అల్ ఖాయిదా ఉగ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న పలు విమానాలను హైజాక్ చేసి అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్, ప్రపంచ వాణిజ్య సంస్థ టవర్లను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనలో సుమారు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Al qaeda
Ayman al-Zawahiri
THREAT

More Telugu News