చంద్రబాబు సర్కారు రాజధాని అమరావతిపై అసలు గెజిట్ నోటిఫికేషనే ఇవ్వలేదు!: మంత్రి బొత్స సంచలన ప్రకటన
- రాజధానిని బాబు తాత్కాలికం చేశాడు
- ఐదేళ్లు అధికారమిస్తే ఎంజాయ్ చేశాడు
- రాష్ట్ర ఖజానాను దోచేశాడు
- తాడేపల్లిలో మీడియాతో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి
‘అన్నిటినీ తాత్కాలికం అని చెప్పి ఇన్నేళ్లు చంద్రబాబు ఎలా అయితే బతికాడో, అమరావతిని కూడా అదే రీతిలో తాత్కాలికంగా ఉంచాడు. అంతేకానీ రాజధాని అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఒకవేళ జరిగినట్లు చంద్రబాబు చెబితే నేను కరెక్ట్ చేసుకుంటాను. అసలు రాజధానిపై గెజిటే విడుదల చేయకుండా అసలు నీకు(చంద్రబాబుకు) మాట్లాడే హక్కు ఉందా? ప్రజలు ఐదేళ్లు పాలించమని తీర్పు ఇస్తే ఎంజాయ్ చేశావ్. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టావ్. చంద్రబాబే చెప్పాడు కదా.. కట్టిన బిల్డింగులు తాత్కాలికమని. ఏ ముఖం పెట్టుకుని ఏం పుస్తకం రిలీజ్ చేస్తాడు? చిన్నవయసులోనే వైఎస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజారంజక పరిపాలన అందిస్తుంటే, నువ్వా(చంద్రబాబు) విమర్శించేది?
మీరా మాకు నీతులు చెప్పేది? పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంట. ఎక్కడికి పోతారండీ పెట్టుబడిదారులు. నీలాంటి వాడి పాలన ఉంది కాబట్టే ఇన్నాళ్లూ పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. ఎవరూ పర్మినెంట్ గా ఈ రాష్ట్రానికి రాలేదు. అందుకే ఇవాళ మీడియా ద్వారా గత 100 రోజుల్లో జరిగిన పరిపాలనను వివరిస్తున్నాం. జగన్ మా అన్న, తమ్ముడు, కుటుంబ సభ్యుడు అని ప్రతీ పేదవాడు అనుకునేలా మేం పరిపాలన అందిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.