Hyderabad: ఇంట్లో పదేపదే దొంగతనం... దొంగను ఇట్టే పట్టించిన యజమాని ప్లాన్!

  • హైదరాబాద్, బంజారాహిల్స్ లో ఘటన
  • నోట్ల నంబర్లు రాసి పెట్టుకున్న యజమాని
  • దొంగను పట్టేసిన పోలీసులు

ఇంట్లో ఉంచిన డబ్బులు ఉంచినట్టే మాయమవుతున్నాయి. ఎవరు తీసుకున్నారో, ఎలా పోయాయో తెలియడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఓ ఇంటి యజమాని, మాస్టర్ ప్లాన్ వేశాడు. పోలీసుల సాయంతో దొంగను ఇట్టే పట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని సింగాడీ బస్తీలో నివసించే ఉప్పరి అఖిల (20), అదే ప్రాంతంలోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న భీమ్ రెడ్డి పటేల్‌ ఇంట్లో పనిచేస్తోంది. గత కొంత కాలంగా భీమ్ రెడ్డి ఇంట్లో డబ్బులు మాయమవుతున్నాయి. ఎవరు తీస్తున్నారో తెలుసుకునేందుకు ఆయన, కావాలనే కొంత డబ్బు ఓ చోట పెట్టి, వాటిపై ఉన్న నంబర్లను నోట్ చేసుకున్నారు.

ఆపై కాసేపటికి డబ్బు మాయమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించగా, వారు వచ్చి ఇంట్లోని ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు. పోలీసుల తనిఖీల్లో అఖిల వద్ద ఇంటి యజమాని చెప్పిన నోట్ల నంబర్లతో కూడిన నోట్లు దొరికాయి. ఆమెను విచారించడంతో తానే తీసుకున్నానని చెప్పింది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని బంజారాహిల్స్ పోలీసు అధికారులు తెలిపారు. 

More Telugu News