Andhra Pradesh: అసెంబ్లీ ఫర్నిచర్ ను ఇంటికెందుకు తీసుకెళ్లారో కోడెల చెప్పాలి: కన్నబాబు

  • స్పీకర్ గా పని చేసిన వ్యక్తే ఇలా చేస్తే ఎలా?
  • కోడెల విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది
  • రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

'గతంలో ఏపీ స్పీకర్ గా పని చేసిన కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలి' అని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది కనుకనే ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లామని చెబుతున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదని విమర్శించారు. స్పీకర్ గా పని చేసిన వ్యక్తే ఇలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు. కోడెల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

 కృష్ణా నది వరదతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు వంద శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారని, దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని, మినుము, పెసల విత్తనాలు కూడా సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ తిరగడంపై టీడీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారని, అసలు, ఈ రాష్ట్రంలో డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బాబు కాదా? అని ప్రశ్నించారు. వరదల కారణంగా ఎవరికీ నష్టం లేకుండా చర్చలు తీసుకునేందుకే డ్రోన్ ను వినియోగించడం జరిగిందని అన్నారు.

More Telugu News