పాక్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్న భారత సైన్యం
- సరిహద్దు రాష్ట్రాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లపై సమీక్ష
- బోర్డర్ కు మరింత సమీపంలోకి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు
- పాక్ ఎయిర్ స్ట్రైక్స్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్మీ నిర్ణయం
జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లపై సమీక్ష నిర్వహించామని... ఈ యూనిట్లను సరిహద్దుకు మరింత చేరువలోకి పంపించాలని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడినట్టు ఆర్మీకి సంబంధించి ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లలో... ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ తో పాటు రష్యాకు చెందిన క్వాడ్రాట్లు, ఇతర పాత తరం సిస్టమ్ లు ఉంటాయి. డీఆర్డీ-ఇజ్రాయల్ సంయుక్తంగా తయారుచేస్తున్న ఎంఆర్-ఎస్ఏఎం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన బలగాలకు అందుబాటులోకి రాబోతోంది.
బాలాకోట్ పై వాయుసేనకు చెందిన మిగ్-21, సుఖోయ్-30ఎంకేఐలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాకిస్థాన్ కు మన వాయుసేన విమానాల ద్వారా జరిగిన నష్టం కంటే... మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా జరిగిన నష్టమే ఎక్కువని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను బోర్డర్ కు మరింత దగ్గర్లో ఏర్పాటు చేయడంతో పాటు, దాన్ని మరింత బలోపేతం చేసే పనిలో ఇండియన్ ఆర్మీ ఉంది.