ఫైనల్‌కు చేరిన చెన్నై.. రేపు ముంబైతో తాడో పేడో!
- ఢిల్లీపై సునాయాసంగా గెలిచిన ధోనీ సేన
- ఐపీఎల్‌లో 8వ సారి ఫైనల్లోకి అడుగుపెట్టిన చెన్నై
- రేపు ముంబైతో టైటిల్ పోరు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. కీలక మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీషా (5) శిఖర్ ధవన్ (18) సహా టాపార్డర్ మొత్తం చేతులెత్తేసింది. జట్టును ఆదుకుంటాడనుకున్న రిషభ్ పంత్ కూడా ఎటువంటి మెరుపులు లేకుండా 38 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఢిల్లీ ఆటగాళ్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారంటే ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. చెన్నై బౌలర్ల దెబ్బకు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ఫా డుప్లెసిస్ (50), షేన్ వాట్సన్ (50) ఇద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై అలవోకగా విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు 20 పరుగులు చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేసిన ఫా డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈనెల 12 (ఆదివారం)న జరిగే టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్‌తో ధోనీ సేన తలపడనుంది.