Odisha: 'ఫణి' భయపెడుతోంది... ఉప ఎన్నిక వాయిదా కోరిన ఒడిశా సీఎం!

  • మూడు రాష్ట్రాలను భయపెడుతున్న 'ఫణి'
  • పట్కురా ఉప ఎన్నికను వాయిదా వేయండి
  • సునీల్ అరోరాను కోరిన నవీన్ పట్నాయక్

బంగాళాఖాతంలో అత్యంత తీవ్రమైన తుపానుగా ఏర్పడి మూడు రాష్ట్రాలను భయపెడుతున్న 'ఫణి' తుపాను రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉండటంతో, ఒడిశాలో జరగాల్సిన పట్కురా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను ఆయన కోరారు. న్యూఢిల్లీలో అరోరాను కలిసిన పట్నాయక్, తుపాను ప్రభావం అత్యధికంగా ఉండే సమయంలో ఎన్నిక ఉందని గుర్తు చేశారు. బీజేడీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ అగర్వాల్ మరణంతో పట్కురా నియోజకవర్గానికి ఉప ఎన్నికను ప్రకటించారు.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఒడిశాలోని కాలాహండి, సంబల్ పూర్, డియోగ్రాఫ్, సుందర్ గఢ్ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురవనుంది. మే 1 నుంచి కనీసం మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మే 3న దక్షిణ పూరీ ప్రాంతంలో 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, 4వ తేదీ నాటికి తుపాను ప్రభావం కొంతమేరకు తగ్గుతుందని తెలిపింది. కాగా, ఒడిశా, ఆంధ్రా కోస్తా తీరాన్ని గత సంవత్సరం వణికించిన 'తిత్లీ' కన్నా 'ఫణి' తీవ్రత అధికమని అధికారులు అంటున్నారు.

More Telugu News