pm narendra modi: ప్రధాని మోదీ బయోపిక్ కు బ్రేక్.. మే 19 వరకూ విడుదల చేయొద్దని ఈసీ ఆదేశం!

  • రేపు విడుదలకు ఏర్పాట్లు చేసుకున్న నిర్మాత సందీప్
  • సినిమా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందన్న ఈసీ
  • ఇప్పటికే యూ సర్టిఫికెట్ జారీచేసిన సెన్సార్ బోర్డు

ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. లోక్ సభ పోలింగ్ పూర్తయ్యేవరకూ ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు ఈసీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖతో పాటు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ సినిమాలోని సన్నివేశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ఈసీ అభిప్రాయపడింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాను నిలిపివేయాలని నిన్న దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో ఈసీనే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాను పోలింగ్ ముగిసే మే 19 వరకూ విడుదల చేయరాదని ఆదేశించింది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ ను జారీచేసింది. పీఎం నరేంద్ర మోదీ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోదీ పాత్రలో నటించారు. తొలుత ఈ సినిమాను ఈ నెల 5నే విడుదల చేయాలనుకున్నారు. అయితే సెన్సార్ పూర్తి కాకపోవడంతో మరో వారం వాయిదా పడింది. ఈ సినిమాను రేపు విడుదల చేయాలని నిర్మాత సందీప్ సింగ్ భావించినప్పటికీ ఈసీ నిషేధం విధించింది.

More Telugu News