Chittoor District: చంద్రగిరిలో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయం: పులివర్తి నాని ధీమా

  • చంద్రగిరిలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ యుద్ధం
  • చంద్రబాబును చూసి మాకు ఓటెయ్యాలి 
  • మా నడవడిక ఎలా ఉందో ప్రజలు చూడాలి

చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ పోటీపడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇప్పటికే ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పులివర్తి నాని మాట్లాడుతూ, యువకులు, మహిళలు, రైతులు ఇలా ప్రతిఒక్కరూ టీడీపీ వైపే ఉన్నారని అన్నారు.

రెండు దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు కనుక విజయం కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు?

నాని: నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి ప్రజల వద్దే తిరుగుతున్నా. మొదట వారిని కలిసినప్పుడు నాకు ఓటేయమని అడగలేదు. వారి సమస్యలు తెలుసుకున్నా. వాటిని పరిష్కరించా. క్యాడర్ అంతా ఏకతాటిపై వెళుతున్నాం.

ఈ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో ఉండటంతో ప్రభుత్వ నిధులు ఇవ్వలేదని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు!

నాని:  ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తిరగలేదు. దీంతో, ఏ ఊరిలో ఏం అభివృద్ధి జరిగిందో ఆయనకు తెలియదు.

నాని విపరీతంగా డబ్బులు పంపిణీ చేస్తున్నాడని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం?

నాని: ఎవరు డబ్బులు పంపిణీ చేస్తున్నారో గమనిస్తే తెలుస్తుంది. నాలుకకు ఎముక లేదని ప్రతిపక్ష నాయకులు ఏదైనా మాట్లాడొచ్చు!

టీడీపీలో ఉన్న గ్రూప్ ల కారణంగా ఈ నియోజకవర్గంలో మళ్లీ ఓటమి తప్పదంటున్నారు?

నాని: చంద్రగిరి నియోజకవర్గంలో ఏ గ్రూప్ లు లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే గ్రూప్, తెలుగుదేశం గ్రూప్, నారా చంద్రబాబు గ్రూప్. కుప్పం తరహాలో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నదే అజెండా.  

చంద్రబాబును చూసి ఓటెయ్యాలా? నాని సమర్థతను చూసి ఓటెయ్యాలా?

నాని: చంద్రబాబునాయుడు గారి సమర్థత వల్లే మేమున్నాం. ఆయన పథకాల వల్లే మేము ఈరోజు ప్రజల వద్దకు వెళ్లగలుగుతున్నాం. చంద్రబాబును చూసి ఓటెయ్యాలి. మా నడవడిక ఎలా ఉందో ప్రజలు చూడాలి. మే23 వ తేదీన తెలుగుదేశం జెండా రెపరెపలాడటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం.

More Telugu News