Andhra Pradesh: కావాలనే బాలనాగిరెడ్డి కుటుంబం గొడవకు దిగింది. నాపై కాల్పులు జరిపించింది!: టీడీపీ నేత తిక్కారెడ్డి

  • పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు
  • ప్రచారం విషయాన్ని ఎస్పీకి ముందుగానే తెలిపా
  • ఆందోళనకు దిగిన తిక్కారెడ్డి అనుచరులు

టీడీపీ నేత తిక్కారెడ్డిపై ఈరోజు కర్నూలు జిల్లాలోని ఖగ్గల్ గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు దాడిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తనపై దాడి జరగడంపై టీడీపీ నేత తిక్కారెడ్డి స్పందించారు. బాలనాగిరెడ్డి కుటుంబమే తనపై కాల్పులు జరిపించిందని తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ దాడి జరుగుతుండగా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బాలనాగిరెడ్డి కుటుంబం ఈరోజు గొడవకు దిగిందని స్పష్టం చేశారు.

ఖగ్గల్ లో ప్రచారానికి వెళుతున్న విషయాన్ని తాను కర్నూలు ఎస్పీకి ముందుగానే తెలిపానని వ్యాఖ్యానించారు. అయినా తనకు తగిన రక్షణ కల్పించలేదనీ, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు బాలనాగిరెడ్డి వర్గీయులు దాడిచేయడాన్ని వ్యతిరేకిస్తూ తిక్కారెడ్డి అనుచరులు మంత్రాలయంలోని శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఘటనలో తుపాకి బుల్లెట్ కాలి తొడభాగంలోకి దూసుకుపోవడంతో వైద్యుల సూచన మేరకు తిక్కారెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

More Telugu News