నెల్లూరు టీడీపీ అభ్యర్థి ఆదాల కంపెనీ ఖాతాలోకి రూ. 43 కోట్లు.. ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన నేత.. కలవరంలో టీడీపీ!
- 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్
- రూ. 43 కోట్లు ఖాతాలో పడగానే ఆదాల మాయం
- త్వరలో వైసీపీలో చేరిక అంటూ ప్రచారం
ఆదాల అదృశ్యం వెనక మరో కోణం కూడా ఉందన్న వార్తలు తాజాగా బయటకొచ్చాయి. 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆదాల క్లియర్ చేయించుకున్నారని, దాదాపు రూ. 43 కోట్ల బిల్లులకు క్లియర్ అయినట్టు సమాచారం. గురువారం అర్ధరాత్రి వరకు అమరావతిలోనే ఉన్న ఆదాల ఆ తర్వాత నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ. 43 కోట్లు ఆయన కంపెనీ ఖాతాలో జమ అయినట్టు ఆయన మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అంతే.. ఆ వెంటనే ప్రచారాన్ని ముగించిన ఆదాల అమరావతికి రమ్మంటున్నారంటూ అక్కడి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు.
ప్రభాకర్ రెడ్డి అదృశ్యం వార్తతో ఉలిక్కిపడిన టీడీపీ నేతలు ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ప్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆదాల వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది.