India: మసూద్ అజర్ కు, దలైలామాకు పోలిక పెట్టిన పాకిస్థాన్ జర్నలిస్ట్.. విరుచుకుపడిన నెటిజన్లు

  • దలైలామాకు భారత్ ఆశ్రయం ఇస్తోంది
  • చైనా ఆగ్రహానికి అదే కారణం అంటూ ట్వీట్
  • "నువ్వూ... నీ పోలిక!" అంటూ రెచ్చిపోయిన జనాలు

హమీద్ మీర్ అనే పాకిస్థానీ సీనియర్ జర్నలిస్ట్ ఓ ట్వీట్ కారణంగా నెటిజన్ల చేతిలో చీవాట్లు తిన్నాడు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ వ్యవహారాన్ని శాంతికాముకుడిగా పేరుగాంచిన దలైలామాతో పోలికపెట్టి అభాసుపాలయ్యాడు. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా, చైనా తన వీటో పవర్ తో దాన్ని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. చైనా అలా ఎందుకు చేసిందో పాకిస్థాన్ పాత్రికేయుడు హమీద్ మీర్  మహ గొప్పగా వివరించాడు!

 "దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఐరాస భద్రతామండలిలో మసూద్ అజర్ పై తీర్మానాన్ని చైనా వ్యతిరేకించడానికి బలమైన కారణమే ఉంది. చైనాకు కొన్ని దశాబ్దాలుగా ప్రబల విరోధిగా ఉన్న దలైలామాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. అందుకే మసూద్ పై భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా వీటో చేసింది" అంటూ ట్వీట్ చేశాడు.

అయితే, సామాజిక మాధ్యమాల్లో హమీద్ మీర్ అతి తెలివిని నెటిజన్లు ఎండగట్టారు. "నోబెల్ అవార్డు గ్రహీత అయిన ఓ శాంతిదూతను కరుడుగట్టిన ఉగ్రవాదితో పోల్చడం చూస్తుంటే పాకిస్థాన్ ఎందుకు అడుక్కుతింటుందో అర్థమవుతోంది... వెళ్లండి, వెళ్లి చైనా, సౌదీల వద్ద చిప్ప పట్టుకుని అడుక్కోండి" అంటూ ఓ నెటిజన్ పదునైన విమర్శ చేశాడు. మరో నెటిజన్ కూడా ఇదే రీతిలో స్పందించాడు. దలైలామాకు మసూద్ అజర్ కు పోలిక పెట్టినప్పుడే మీ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది అంటూ వ్యాఖ్యానించారు. నువ్వసలు జర్నలిస్ట్ వృత్తికే కళంకం అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

More Telugu News