కల్యాణ్ రామ్ సినిమా పేరును పదేపదే తప్పుగా పలికిన బాలకృష్ణ.. విస్తుపోయిన అభిమానులు

  • ఘనంగా 118 సినిమా ప్రీ రిలీజ్ వేడుక
  • ముఖ్య అతిథిగా బాలయ్య
  • సినిమా పేరును 189గా పేర్కొన్న బాలకృష్ణ
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందించిన ‘118’ సిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలుమార్లు సినిమా పేరును తప్పుగా చెప్పడంతో అభిమానులు కంగు తిన్నారు. వెనక నుంచి కల్యాణ్ రామ్ హింట్ ఇచ్చే ప్రయత్నం చేసినా బాలయ్య తనదైన శైలిలో మాట్లాడుతూ పోయారు.

కల్యాణ్ రామ్‌ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడని బాలయ్య ప్రశంసించారు. కొత్త వాళ్లకు ఇవ్వడం కోసం ‘అతడొక్కడే’ సినిమాను నిర్మించాడని గుర్తు చేశారు. ఆ తపన కల్యాణ్ రామ్‌లో కనిపిస్తుందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్టు ప్రొడక్షన్ బ్యానర్‌పై 118 సినిమాను నిర్మించిన మహేశ్ కోనేరుకి, దర్శకుడు గుహన్‌కు, సంగీత దర్శకుడు శేఖర్ చంద్రకు, హీరోయిన్లు  నివేదా థామస్, శాలినీ పాండే, ఇతర కళాకారులకు బాలకృష్ణ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా పేరు ప్రతిష్ఠలు తీసుకురావడంతోపాటు ఆర్థికంగానూ లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.  

కాగా, బాలయ్య తన ప్రసంగంలో సినిమా పేరును 189 అని పలుమార్లు తప్పుగా పేర్కొన్నారు. తెలుగులో గుహన్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం 189 అని పేర్కొనడంతో ఆహూతులు నివ్వెరపోయారు. కల్యాణ్ రామ్ వెనక నుంచి సినిమా పేరును సరిచేసే ప్రయత్నం చేసినా బాలకృష్ణ వినిపించుకోలేదు. తప్పును సవరించుకోకుండానే తన ప్రసంగాన్ని ముగించారు.  
Go Back to Shorts
Balakrishna
Kalyan ram
118 movie
pre release function
Hyderabad

More Telugu News