Jagan: మీరు చెప్పండి... నేను చేసి చూపిస్తా: తటస్థులతో వైఎస్ జగన్

  • చిత్తూరు జిల్లాలో తటస్థులతో సమావేశం
  • వైకాపా ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని భరోసా
  • తెలుగు భాష పరిరక్షణకు కృషి
  • కొత్త లాయర్ కు నెలకు రూ. 5 వేల స్టయిఫండ్

ఏ రాజకీయ పార్టీకీ చెందని ఓటర్లను టార్గెట్ గా చేసుకుని, వారికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్, తాజాగా చిత్తూరు జిల్ల తనపల్లె క్రాస్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్ లో తటస్థులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఎలా పనిచేయాలో సూచిస్తే, తాను దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాన్ని గమనిస్తున్నానని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత అంతా మంచే జరుగుతుందన్న భరోసాను ఇచ్చారు.

తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సివుందని శ్రీదేవి అనే మహిళ సూచించగా, ఇది మనందరి బాధ్యతని, కొత్తగా చట్టాలు తేవడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగిస్తానని అన్నారు. పేదలకు సరైన విద్య అందడం లేదని ఓ న్యాయవాది చెప్పగా, ప్రతి పిల్లవాడినీ చదివించే బాధ్యత తనదని, పిల్లల చదువులు ఆగరాదనే నవరత్నాల పథకంలో అమ్మఒడిని చేర్చానని అన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వారికి నెలకు రూ. 5 వేల స్టయిఫండ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో దోపిడీ అధికంగా ఉందని మరో వ్యక్తి చెప్పగా, ఈ అంశంపై తాను దృష్టిని సారించానని, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులను అందుబాటులోకి తెస్తామని, ఆసుపత్రిలో రూ. 1000కి మించి ఖర్చయితే, ఆరోగ్య శ్రీ వర్తించేలా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

More Telugu News