Kadapa District: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పద్ధతులు.. ‘కడప’ టీడీపీ నేతల దృష్టిని ఆకర్షించిన చరణ్ రాజు!

  • పొలాలను అద్దెకు తీసుకుంటున్న చరణ్
  • కార్పొరేట్ తరహాలో వ్యవసాయం నిర్వహణ
  • రాజంపేట ఇన్ చార్జిగా నియమించే ఛాన్స్

కడప జిల్లా టీడీపీలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజంపేటలో మేడాకు చెక్ పెట్టేందుకు ‘రెడ్ బస్’ యాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ రాజును రంగంలోకి దించాలని జిల్లా టీడీపీ నేతలు యోచిస్తున్నారు. రేపు సీఎం చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆయన పేరును ప్రతిపాదించాలని భావిస్తున్నారు.

కడప జిల్లా టి.సుండుపల్లి మండలం చెండ్రాజుగారిపల్లికి చెందిన చరణ్ రాజు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అయితే ‘రెడ్ బస్’ యాప్ ను తయారు చేయడం కోసం ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశారు. ప్రస్తుతం కడప జిల్లాలోని సుండుపల్లిలో 300 ఎకరాల బీడు భూములను రైతుల నుంచి అద్దెకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ప్రతి నెల రైతులకు అద్దెను చెల్లిస్తున్నారు. సైట్‌ మేనేజర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సేల్స్‌ మేనేజర్ల హోదాలో యువతను ఉద్యోగంలోకి తీసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నారు.

ఈ 300 ఎకరాలకు గాను ఆరుగురు సైట్‌ ఇన్‌ఛార్జిలు ఉన్నారు. 35 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. సైట్‌ ఇన్‌ఛార్జికి నెలకు రూ.10,000-15,000 వరకూ వేతనం ఇస్తున్నారు. అంతేకాకుండా అలవెన్సుల రూపంలో మరో రూ.2,000 లభిస్తాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు రూ.6-7 వేల వరకు వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్లకు నెలకు రూ.14 వేల వరకూ చెల్లిస్తున్నారు.

అనంతపురం, కడప జిల్లాల నుంచి కొందరు వ్యక్తులు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ ఉద్యోగులను ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం దాదాపు 1,300 మంది కూలీలు ఇక్కడ పనిచేస్తున్నారు. అన్ని వసతులు ఉంటే ఎకరా భూమికి చరణ్ టీమ్ నెలకు రూ.2,000 అద్దె చెల్లిస్తుంది. వసతులు తక్కువగా ఉంటే అద్దె రూ.1,000 ఇస్తారు.

పది ఎకరాల మంచి భూమిని ఇచ్చిన రైతుకు నెలకు రూ.20,000 అద్దె అందుతుంది. అంటే ఏడాదికి రూ.2.40 లక్షలు అన్నమాట. ఇందులో భాగంగా 6 నెలల అడ్వాన్సును రైతులకు ముందుగానే చెల్లిస్తారు. ఈ ఒప్పందం ఐదేళ్ల వరకు ఉంటుంది. పొలం యజమానికే భూమిపై సర్వహక్కులు ఉంటాయి. వ్యవసాయ పనులు మాత్రం చరణ్‌ బృందం చూసుకుంటుంది. ఇలాంటి విప్లవాత్మక వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న చరణ్ రాజును ఇప్పుడు టీడీపీ నేతలు రాజంపేట నుంచి రంగంలోకి దించే యోచనలో ఉన్నారు.

More Telugu News