Kotler Presidential Award: మోదీ అందుకున్న అవార్డు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది!: రాహుల్ గాంధీ వ్యంగ్యం

  • ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును అందుకున్న మోదీ
  • ఈ అవార్డుకు కనీసం జ్యూరీ కూడా లేదంటూ ఎద్దేవా చేసిన రాహుల్
  • తొలి అత్యంత రహస్యమైన అవార్డును అందుకున్నారన్న సీతారాం ఏచూరి

భారత ప్రధాని మోదీ మొట్టమొదటి 'ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు'ను అందుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు మోదీని కీర్తిస్తుండగా... అదే స్థాయిలో విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అవార్డుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, 'ప్రపంచ ప్రఖ్యాత కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును అందుకున్న మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నా. ఈ అవార్డు నిజంగా ప్రఖ్యాతిగాంచినదే. ఎందుకంటే దీనికి కనీసం జ్యూరీ కూడా లేదు. ఇంత వరకు ఎవరికీ ఇవ్వనూ లేదు. ఎప్పుడూ వినని అలీగఢ్ కంపెనీ దీని వెనుక ఉంది' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

రాహుల్ ట్వీట్ కు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ రీట్వీట్ చేశారు. 'ఎంతో ఆదరణ ఉన్న ప్రధానమంత్రికి మరెంతో అద్వితీయమైన అవార్డు వచ్చింది. అసమానమైన, అసాధారణమైన, అద్భుతమైన అవార్డు ఇది' అంటూ ఎద్దేవా చేశారు.

ఆ వెంటనే సీపీఐ అగ్రనేత సీతారాం ఏచూరి స్పందించారు. 'ప్రపంచంలోనే తొలి అత్యంత రహస్యమైన అవార్డును అందుకున్న ప్రధానికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెబుతున్నా. మరెవరూ ఈ అవార్డును గెలుచుకోలేరు' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

More Telugu News