Nellore District: పంటి బిగువన ప్రసవ వేదన... పరీక్షరాసి స్పృహతప్పిన యువతి!

  • పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన
  • టీచర్ పోస్టుకు పరీక్ష రాసేందుకు వచ్చిన స్వాతి
  • ఎగ్జామ్ రాసిన గంట వ్యవధిలోనే ప్రసవం

ఎలాగైనా పరీక్ష రాసి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా నిలవాలన్నది ఆమె కృతనిశ్చయం. అదే లక్ష్యంతో పరీక్ష రాసేందుకు వచ్చిందామె. అప్పటికే నిండు చూలాలు. పరీక్షకు ముందుగానే నొప్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నా, విషయం ఎవరికీ తెలియకుండా చిరునవ్వుతో పరీక్ష కేంద్రానికి వచ్చింది. భర్తకు కూడా విషయం తెలియనీయకుండా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లింది. నొప్పులు అధికమవుతూ ఉంటే పంటి బిగువన భరించింది. ఎగ్జామ్ రాసి చివరలో స్పృహ కోల్పోగా, చూసినవారు వెంటనే ఆసుపత్రికి తరలిస్తే, అక్కడ పండంటి మగబిడ్డను ప్రసవించింది.

ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, నార్త్ రాజుపాలెంలో జరిగింది. కావలి మండలానికి చెందిన స్వాతి పరీక్ష రాసిన గంట వ్యవధిలోనే బిడ్డను ప్రసవించింది. కార్పెంటర్ గా పనిచేసే తన భర్త మహేష్ కు చేదోడు వాదోడుగా నిలవాలన్నదే ఆమె లక్ష్యం. చదువులో ప్రోత్సహించిన భర్తకు, తన ఉద్యోగాన్ని కానుకగా ఇవ్వాలని రాత్రింబవళ్లూ కష్టపడి చదివింది.

భర్తతో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆమె, జవాబు పత్రాలను ఇన్విజిలేటర్ కు ఇచ్చి పురిటి నొప్పులతో కిందపడిపోయింది. కాలేజ్ ఛైర్మన్‌ పెనుబల్లి బాబునాయుడుకు విషయం తెలియగానే, ఆయన తన కారులో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి పంపారు. బిడ్డ పుట్టడంతో ఇప్పుడా తల్లి ఆనందానికి అవధుల్లేవు.

More Telugu News