ఈసారి అధికారంలోకి రాలేమని చంద్రబాబుకు భయం పట్టుకుంది!: వైసీపీ నేత బొత్స
- హైదరాబాద్ ను స్వార్థంతో వదులుకున్నారు
- అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అండగా ఉంటుంది
- హోదాను తాకట్టు పెట్టి పోలవరం తెచ్చుకున్నారు
తెలంగాణ ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని బొత్స విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందనీ, వారికి న్యాయం జరిగే వరకూ విశ్రమించబోమని స్పష్టం చేశారు. జగన్ కోసమే హైకోర్టును విభజించారని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పదేళ్ల రాజధానిని ముందుగానే వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు పోలవరం కాంట్రాక్టును తీసుకున్నారని ఆరోపించారు. కేవలం డ్యామ్ కు ఒకే గేటు పెట్టి నీళ్లు ప్రతీ ఇంటికి వచ్చేసినట్లు, విశాఖ ప్రజలంతా పోలవరం నీటినే తాగుతున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేట్లు ఇంకా 47 పెట్టాల్సి ఉందనీ, ఒక్కో గేటు నిర్మాణానికి 60 రోజులు పడుతుందని చెప్పారు.