పరువు హత్య వెనుక పచ్చి నిజం... కుమార్తెను హత్య చేయమని చెప్పిన కన్నతల్లి!
- నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన పరువు హత్య
- తల్లితో ఫోన్ లో మాట్లాడించి, ఆపై హత్య
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం రామగుండం సీపీ
ప్రేమ పెళ్లి చేసుకుని, స్వగ్రామానికి వచ్చిన తరువాత, అనురాధ, లక్ష్మణ్ ల ఫిర్యాదు మేరకు వారి తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కు పిలిచామని, తాము ఆసుపత్రిలో ఉన్నామని, మరుసటి రోజు వస్తామని వారు చెప్పగా నమ్మామని, ఆపై అనురాధను పోలీసుల రక్షణతో ఇల్లు చేర్చామని, 24 గంటలు గడవకుండానే సత్యన్న, లక్ష్మిలు ఇంత దారుణం చేస్తారని ఊహించలేదని అన్నారు.
పోలీసులు వెళ్లిపోయిన తరువాత రాత్రి 7.30 గంటల సమయంలో సత్యన్న, లక్ష్మి, మహేశ్ లు లక్ష్మణ్ ఇంటికి వెళ్లి, అనురాధను కొడుతూ తమ ఇంటికి లాక్కెళ్లారని, సొమ్మసిల్లిపడిపోయిన ఆమె ముఖంపై నీళ్లు చల్లి లేపి, లక్ష్మణ్ ను మర్చిపోవాలని హెచ్చరించారని సత్యనారాయణ తెలిపారు. తన భర్తను వదిలివుండలేనని ఆమె స్పష్టం చేయగా, ఆమెను బైక్ పై ఓ గుట్టపైకి తీసుకెళ్లి మరోసారి ఆమెను కొట్టారని తెలిపారు. అప్పటికీ ఆమె మారకపోవడంతో తల్లి లక్ష్మితో ఫోన్ లో మాట్లాడించారని, తల్లి నచ్చజెప్పినా వినకపోవడంతో, ఆగ్రహంతో ఉన్న ఆమె, అనురాధను చంపేయాలని భర్త, కుమారుడికి చెప్పిందన్నారు.
ఆపై ఆమె గొంతును సత్యన్న నులిమాడని, మహేష్ కట్టెలు పేర్చి, దహనం చేసి, తెల్లవారుజాము వరకూ ఉండి, మంటలు ఆర్పి, బూడిదను కాలువలో కలిపి వెళ్లిపోయారని అన్నారు. ఈ కేసులో హత్యకు సహకరించి, పరారీలో ఉన్న నర్సయ్య, కుమార్ ల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.