Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా అధికారులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!

  • పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం
  • ఇప్పటికే 4 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం
  • ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానన్న హామీని నిలబెట్టుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్రాలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.80,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణాల్లో ఇళ్లు లేని 3.83 లక్షల లబ్ధిదారులను గుర్తించామని, మిగిలినవారిని కూడా త్వరగా గుర్తించి ఆవాసం కల్పిస్తామని అన్నారు. అమరావతిలో ఈరోజు కలెక్టర్లు, పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏపీలోని పట్టణాల్లో 1,81,700 ఇళ్లకు శ్లాబులు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ లో ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఏపీలో ప్రతీ జిల్లా పశ్చిమగోదావరి నమూనాను అనుసరించాలని చంద్రబాబు సూచించారు. గృహమిత్రలను నియమించడం ద్వారా అక్కడ అద్భుతమైన ఫలితాలను సాధించారని ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లాలో అధికారుల చొరవతో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

More Telugu News