sabbam hari: కేసీఆర్ అలా చేయకపోతే.. ఆయనకు సపోర్ట్ చేసిన ఏపీ నేతలు ఇబ్బంది పడతారు: సబ్బం హరి

  • ఇరు రాష్ట్రాల అభ్యున్నతికి కేసీఆర్ పాటుపడాలి
  • కేసీఆర్ కోసం బీజేపీ సొంత పార్టీని కూడా త్యాగం చేసింది
  • ప్రస్తుతం ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవు

తెలంగాణలో కేసీఆర్ ను మళ్లీ గెలిపించేందుకు బీజేపీ ఎంతో కష్టపడిందని... కానీ, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని, కేవలం రాజాసింగ్ మాత్రమే గెలుపొందారని మాజీ ఎంపీ సబ్బం హరి ఎద్దేవా చేశారు. దక్షిణాదిలో కేసీఆర్ మాత్రమే తమతో ఉంటారని బీజేపీ హైకమాండ్ భావిస్తోందని... అందుకే తెలంగాణలో కేసీఆర్ గెలిచేందుకు సహకరించారని విమర్శించారు. కేసీఆర్ గెలుపు కోసం చివరకు వారి పార్టీని కూడా త్యాగం చేశారని అన్నారు.

ఇప్పటికైనా కేసీఆర్ న్యాయబద్ధంగా, చట్ట బద్ధంగా ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి, విభజన హామీలు అమలయ్యేందుకు కృషి చేయాలని చెప్పారు. లేకపోతే, ఏపీలో ఉండి తెలంగాణలో టీఆర్ఎస్ గెలవాలని సంతోషపడ్డ వారు కూడా ఇక్కడ ఇబ్బంది పడతారని అన్నారు. మా రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఇక్కడి వారు అనుకుంటే చేసేదేమీ లేదని, వారికి తోచిన విధంగా వారు ముందుకు వెళ్లవచ్చని చెప్పారు.

హైదరాబాదును అందరూ కలసి అభివృద్ధి చేసుకున్నట్టే... ఎన్ని కుట్రలు, రాజకీయ ఇబ్బందులు ఉన్నా ఏపీని అభివృద్ధి చేసుకుంటామని సబ్బం హరి అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా స్థిరమైన అజెండా ఉండదని... ఏ పార్టీ అయినా ఎప్పుడైనా, ఏ ఇతర పార్టీతో అయినా కలవచ్చని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి అధికారాన్ని నిలుపుకోవడమే అజెండా అని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అధికారంలోకి రావడమే అజెండా అని తెలిపారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండని కోరడం కొత్త పార్టీల అజెండా అని చెప్పారు. ఇంతకు మించి ప్రస్తుతం ఏ పార్టీకి కూడా సిద్ధాంతాలు లేవని తెలిపారు.

More Telugu News