లగడపాటి సర్వే తప్పు.. ఇదిగో ఆయన నాకు పంపిన మెసేజ్!: కేటీఆర్
- లగడపాటి సర్వేపై చంద్రబాబు ఒత్తిడి
- కుట్రను బయటపెట్టేందుకే చాటింగ్ బహిర్గతం
- టీఆర్ఎస్ విజయం ఖాయం
టీఆర్ఎస్ విజయం సాధిస్తుందంటూ స్వయంగా లగడపాటి తనకు మెసేజ్ చేశారని పేర్కొన్న కేటీఆర్ ఆ మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మంగళవారం ఆయన వెల్లడించిన సర్వే వివరాలు పూర్తిగా కుట్ర పూరితంగా ఉండడం వల్లే వాటిని ఖండించాల్సి వచ్చిందన్నారు. గత నెల 20న రాజగోపాల్ తనకు ఓ మెసేజ్ చేశారని, అందులో టీఆర్ఎస్‌కు 65-70 సీట్లు వస్తాయని పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఒత్తిడితో రాజగోపాల్ తన సర్వేను తారుమారు చేశారని, అంకెలు మార్చారని ఆరోపించారు. ఈ కుట్రను బయటపెట్టేందుకే రాజ్‌గోపాల్‌తో జరిగిన చాటింగ్‌ను బయటపెట్టినట్టు పేర్కొన్నారు. కేటీఆర్ బయటపెట్టిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా, ప్రజాకూటమికి 35 నుంచి 40 స్థానాలు వస్తాయి. బీజేపీ 2-3 స్థానాల్లో, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాల్లో విజయం సాధిస్తారు.