చెప్పుతో కొట్టాడని వ్యాపారిని కత్తితో పొడిచి చంపిన రైతు

  • బాకీ చెల్లించమన్నందుకు రైతును చెప్పుతో కొట్టిన వైనం
  • అవమానం భరించలేక కత్తితో దాడి
  • ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
తనను చెప్పుతో కొట్టడాన్ని అవమానంగా భావించిన ఓ రైతు వ్యాపారిపై కత్తితో దాడిచేసిన ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మార్కెట్ యార్డులో జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..   మార్కెట్ యార్డ్‌లో ఖాదర్‌బాషా (40) అనే వ్యాపారి ఓ మండీ నడుపుతున్నాడు. ఎర్రగుట్టపల్లెకు చెందిన పి.జనార్దనరెడ్డి అనే రైతు రెండేళ్లుగా ఖాదర్ బాషాకే టమోటాలను విక్రయిస్తున్నాడు. గతేడాది విక్రయించిన టమోటాలకు గాను ఖాదర్‌బాషా రూ.8,700ను జనార్దనరెడ్డికి ఇవ్వాల్సి ఉంది.

తన బాకీ డబ్బులు ఇవ్వాల్సిందిగా జనార్దనరెడ్డి మంగళవారం సాయంత్రం బాషాను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కల్పించుకున్న బాషా బావమరిది అస్లాం(30).. జనార్దనరెడ్డిని చెప్పుతో కొట్టాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు చెప్పుతో కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన జనార్దనరెడ్డి కత్తితో తిరిగొచ్చి బాషా, అస్లాంపై దాడిచేశాడు. ఈ ఘటనలో అస్లాం మృతి చెందగా, బాషాకు గాయాలయ్యాయి.

ఈ ఘటనతో ఉలిక్కిపడిన మార్కెట్‌లోని వ్యాపారులు జనార్దనరెడ్డిని తరమడంతో పరిగెడుతూ ప్రహరీ దాటబోయి కిందపడ్డాడు. దీంతో వ్యాపారులు అతడిపై రాళ్లతో దాడి చేయడంతో ఎడమ చేయి విరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Chittoor District
Gurramkonda
Market yard
Crime News
Andhra Pradesh

More Telugu News