పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందన్న కోపంతో.. కత్తితో స్టేషన్ కు వెళ్లి మరీ భార్యను నరికిన భర్త!
- బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో ఘటన
- పోలీసులు అడ్డుకుంటున్నా కత్తితో పోట్లు
- భార్య సహా ఐదుగురు కుటుంబీకులపై దాడి
బేగంపేట ప్రాంతంలో కౌసర్ బీ, రెహమాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే రెహమాన్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ వేధింపులు భరించలేని బాధితురాలు ఈ రోజు మిగతా కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తన భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లిందని తెలుసుకుని రెహమాన్ ఆగ్రహోద్రుడయ్యాడు.
కొబ్బరి బోండాలు నరికే కత్తితో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. మహిళా పోలీసులు అడ్డుకుంటున్నా వారి నుంచి తప్పించుకుని భార్యతో పాటు కుటుంబ సభ్యులు సల్మాన్, మస్తాన్ బేగం, షకీరా, షాహిన్ ను విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.
దీంతో స్థానికులు, పోలీసులు బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల్లో భార్యతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.