vijay Malya: ఇంటిని కాపాడుకునే యత్నంలో మాల్యా.. జప్తుకు సిద్ధమవుతున్న యూబీఎస్ బ్యాంకు

  • ఇంటిని తనఖా పెట్టి 26.6 మిలియన్ల రుణం
  • స్వాధీనం చేసుకుంటామన్న యూబీఎస్ బ్యాంకు
  • గతేడాది మార్చితో పూర్తయిన గడువు

విజయ్ మాల్యా కుటుంబ ట్రస్టుకు చెందిన రోస్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ గతంలో లండన్‌ రీజెంట్ పార్క్‌లోని మాల్యా ఇంటిని తనఖా పెట్టి యూబీఎస్‌ బ్యాంకు నుంచి 26.6 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1900 కోట్లు) రుణం తీసుకుంది. ఇది తిరిగి చెల్లించకపోవడంతో యూబీఎస్‌ బ్యాంకు ఇప్పుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని కోరుతూ కోర్టు మెట్లెక్కింది. దీంతో తన ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో మాల్యా ఉన్నారు. ‘‘బ్యాంకుకు గడువులోపు చెల్లిస్తామన్న రుణాన్ని తిరిగి చెల్లించలేదు. అందుకే మేం మాల్యా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలి’’ అని బ్యాంకు తరపు న్యాయవాది థామస్‌ గ్రాంట్‌ లండన్‌ కోర్టును కోరారు.

ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే గడువుకంటే ముందే యూబీఎస్‌ బ్యాంకు జప్తు కోరుతోందని రోస్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్‌ ఇచ్చిన యూబీఎస్‌ బ్యాంకు.. కింగ్‌ ఫిషర్‌ కోసం తీసుకున్న రుణాలు మాల్యా ఉద్దేశపూర్వకంగానే ఎగవేశారని మీడియాలో వస్తున్న వార్తల వల్ల మాల్యాతో, అతని అనుబంధ సంస్థలతో సంబంధాలు తెంచుకునే ఉద్దేశంతోనే ముందస్తు జప్తు కోరుతున్నట్లు పేర్కొంది. ఈ రుణం గడువు గతేడాది మార్చితో పూర్తయిందని వెల్లడించింది.

More Telugu News