కోస్తాంధ్రకు వాయు‘గండం’.. మరింత బలపడుతున్న ‘తిత్లీ’ తుపాను!
- కళింగపట్నం, గోపాల్‌పూర్ మధ్య ప్రస్తుతం కేంద్రీకృతం
- పశ్చిమ వాయవ్య దిశలో ఒడిశా వైపు ప్రయాణం
- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, గాలులకు అవకాశం
సోమవారం రాత్రికి కళింగపట్నం, గోపాల్‌పూర్‌ల మధ్య దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుండడంతో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.
తుపాను ప్రభావం వల్ల మంగళవారం కోస్తా జిల్లాల్లో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తుపానుగా మారాక గాలుల తీవ్రత 90 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ఈ తుపానుకు ‘తిత్లీ’ అని పేరు పెట్టారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర కోస్తా అధికారులను అప్రమత్తం చేశామని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ తెలిపారు.