ప్రేమలో కొత్తకోణం: హైదరాబాద్ పోలీసుల ముందుకు రెండు 'సీన్ రివర్స్' కేసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమలో కొత్తకోణం: హైదరాబాద్ పోలీసుల ముందుకు రెండు 'సీన్ రివర్స్' కేసులు!

  • మెరిట్ స్టూడెంట్ ను 'జీరో' చేసిన యువతి
  • ప్రేమించి పెళ్లికి నిరాకరించిన మరో యువతి
  • కేసులు పెట్టలేమని స్పష్టం చేసిన పోలీసులు
ప్రేమ పెళ్లిళ్లు, ఆపై పెద్దల పగలు, హత్యలు లేదంటే ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన వేళ, కొంత విభిన్నమైన రెండు కేసులు హైదరాబాద్ పోలీసుల ముందుకు వచ్చాయి. ఓ యువతి వేధించడం వల్ల, మెరిట్ స్టూడెంట్ గా ఉన్న తాను ఇప్పుడు చదవలేకపోతున్నానని ఓ యువకుడు ఫిర్యాదు చేయగా, ఓ యువతి తనపై వివక్ష చూపుతోందంటూ మరో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇవి తమ చట్టాల పరిధిలోకి రావని పోలీసులు పేర్కొనడంతో ఇవి రికార్డుల్లోకి ఎక్కలేదని తెలుస్తోంది.

ఓ డాక్టర్ కుమారుడైన మెరిట్ స్టూడెంట్ ఇంటర్ ను 95 శాతం మార్కులతో పూర్తి చేశాడు. అతన్ని కూడా డాక్టర్ ను చేయాలన్న ఉద్దేశంతో నీట్ కోచింగ్ కోసం తల్లిదండ్రులు ఓ సెంటర్లో చేర్పించారు. అదే సెంటర్ లో కోచింగ్ కు వస్తున్న ఓ యువతికి మూర్చరోగం ఉంది. క్లాసులో కుప్పకూలిన ఆమెకు ఇతను సాయం చేయడంతో, అప్పటి నుంచి ప్రేమ పేరిట సదరు యువతి వెంట పడటం మొదలు పెట్టింది.

వాట్స్ యాప్ లో అభ్యంతరకరమైన మెసేజ్ లు పెడుతూ, తన అశ్లీల ఫోటోలను ఆమె పంపుతూ ఉండటంతో డిస్టర్బ్ అయిన సదరు విద్యార్థి మార్కులు తగ్గిపోయాయి. ఈ విషయం యువకుడి తల్లికి తెలిసి, ఆ అమ్మాయికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో కుమారుడితో కలసి స్టేషన్ కు వచ్చిన ఆమె ఫిర్యాదు చేసింది.

మరో కేసులో ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువకుడు, ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తరువాత వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. ఆ అమ్మాయి అతన్ని దూరంగా ఉంచడం మొదలు పెట్టేసరికి, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడతను. రెండేళ్లు తనతో సన్నిహితంగా మెలిగి, తన కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తరువాత దూరం పెట్టడం వివక్ష కిందకు వస్తుందంటూ ఫిర్యాదు చేసి, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడా యువకుడు. దీనిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవడం కుదరదని పోలీసులు స్పష్టం చేయడంతో, ఇప్పుడు కోర్టు కెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.
Hyderabad
Police
Seane Reverse
Lovers
Marriage
NEET

More Telugu News