నీకు ప్రేమించడానికి హిందూ అబ్బాయే దొరకలేదా?.. అంటూ యువతిపై దాడి చేసిన పోలీసులు!

26-09-2018 Wed 08:03
  • ముస్లిం యువకుడిని ప్రేమించిన వైద్య విద్యార్థిని
  • యువకుడి ఇంట్లో ఇద్దరినీ పట్టుకుని దాడి చేసిన వీహెచ్‌పీ కార్యకర్తలు
  • యువతిపై వాహనంలోనే దాడిచేసిన పోలీసులు
ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తోందన్న కారణంతో ఓ యువతిపై పోలీసులు దాడి చేశారు. వ్యానులో ఎక్కించుకుని అనరాని మాటలు అంటూ వేధించారు. అంతేకాదు, యువతిపై దాడిచేస్తున్న వీడియోను కూడా చిత్రీకరించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.  

వీడియోలో ఉన్నదాని ప్రకారం.. పోలీసు వ్యానులో యువతితోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. యువతి పక్కన కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఆమెను కొడుతుండగా, డ్రైవర్ వీడియో తీశాడు. ఎంతోమంది హిందూ యువకులు ఉండగా ముస్లిం అబ్బాయిని ఎందుకు ప్రేమించావంటూ డ్రైవర్ ప్రశ్నించడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.  

ఈ ఘటనకు ముందు వైద్య విద్యార్థిని అయిన ఆమె తన  సహచరుడు అయిన ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లింది. అక్కడ వారిద్దరు ఉండగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వారిపై దాడిచేసి పోలీసులకు అప్పగించారు. యువతిని, యువకుడిని వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. యువతిని తీసుకెళ్తున్న పోలీసులు ఆమెను దూషిస్తూ దాడి చేశారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా పోలీసులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, యువతీయువకులపై దాడి చేసిన వీహెచ్‌పీ కార్యకర్తల్లో ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.