మహానటి చూశాక చాలామంది లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు !:దుల్కర్ సల్మాన్
- నా నెగటివ్ రోల్ వాళ్లకు నచ్చలేదు
- మహానటిలో నాది కీలకమైన పాత్ర
- నాన్న పేరును వాడుకోవడం ఇష్టం లేదు
మహానటి సినిమా చూశాక చాలామంది మహిళా అభిమానులు సోషల్ మీడియాలో ‘ఐ హేట్ యూ’ అంటూ కామెంట్లు పెట్టారని తెలిపాడు. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర కావడంతోనే ప్రతినాయక ఛాయలున్నా నటించేందుకు అంగీకరించానని దుల్కర్ వెల్లడించాడు. ఈ సినిమాకు మొత్తం యువ బృందమే పనిచేసిందనీ, ఓ మంచి సినిమాలో భాగం కావాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులో చేరినట్లు దుల్కర్ అన్నాడు. మెగాస్టార్ అయినా తన తండ్రి మమ్ముట్టి పేరును సినిమాల్లో లేదా బయట ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేదని దుల్కర్ వ్యాఖ్యానించాడు.
ఇక సినిమాలను చూడటంపై స్పందిస్తూ..‘ఇంట్లో అందరం కలిసే నా సినిమాలను చూస్తాం. నేను ముందు వరుసలో కూర్చుంటా. సినిమా చూస్తూ నాన్న వెనుకనుంచి ఎప్పుడైనా నవ్వినా, బాగుందని చెప్పినా అవే నాకు గొప్ప ప్రశంసలు. నాన్న ప్రత్యేకంగా బాగుందని పొగడరు’ అని దుల్కర్ చెప్పాడు. చెన్నైలో పుట్టి, పెరిగిన తనకు తమిళం, మలయాళం వచ్చనీ, మహానటి సమయంలో తెలుగులో డైలాగులు చెప్పేందుకు మాత్రం బాగా ఇబ్బంది పడ్డానని దుల్కర్ చెప్పుకొచ్చాడు.