మందు ఎఫెక్ట్.. పోలీసుల నుంచి బ్రీత్ అనలైజర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు!
- అర్ధరాత్రి చెన్నై రోడ్లపై ఛేజింగ్
- అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం
- ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
అడయార్ సమీపంలో శనివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ లగ్జరీ కారులో అక్కడికి చేరుకున్న భూషణ్.. బ్రీత్ అనలైజర్ తో పరీక్షించేందుకు యత్నిస్తుండగా మెరుపువేగంతో దాన్ని తీసుకుని పరారయ్యాడు. ఈ సమయంలో పూటుగా మందు కొట్టి ఉన్న భూషణ్ పోలీసులకు దొరక్కుండా వేగంగా కారును పోనిచ్చాడు.
సదరు యువకుడిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో చాలాచోట్ల వాహనాల రాకపోకలను నియంత్రించిన అధికారులు అర్ధరాత్రి సమయంలో భూషణ్ కారును గుర్తించి వెంబడించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అభిరామపురం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.