పార్టీ మారడం లేదన్న జార్ఖిహొళి బ్రదర్స్.. ఊపిరి పీల్చుకున్న కుమారస్వామి!
- ఊహాగానాలకు తెరదించిన జార్ఖిహొళి సోదరులు
- కాంగ్రెస్‌ను వీడడం లేదంటూ స్పష్టమైన ప్రకటన
- కుమారస్వామి ప్రభుత్వానికి తప్పిన ముప్పు
తమతో సహా మరో పదిమంది ఎమ్మెల్యేలను తీసుకుని జార్ఖిహోళి సోదరులు బీజేపీలో చేరబోతున్నట్టు సోమవారం వార్తలు షికారు కొట్టాయి. ఇందుకు ప్రతిగా తనను ఏడాదిపాటు సీఎంను చేయాలన్న డిమాండ్‌ను కూడా సతీశ్ జార్ఖిహొలి బీజేపీ ముందు ఉంచినట్టు వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా రమేశ్ జార్ఖిహొళి సోమవారం బీజేపీ నేతలు శ్రీరాములు, రేణుకాచార్యలతో భేటీ అయ్యారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
అయితే, అనూహ్యంగా సాయంత్రానికి వారి నుంచి ఓ ప్రకటన వెలువడింది. తాము కాంగ్రెస్‌ను వీడడం లేదన్నదే దాని సారాంశం. పార్టీ పట్ల తన సోదరుడు సతీశ్ అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనని, పార్టీలో నాలుగేళ్లుగా అతడికి తీవ్ర అన్యాయం జరుగుతోందని రమేశ్ అందులో పేర్కొన్నారు. పీఎల్‌డీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు కొంత చిరాకు కలిగించాయన్నారు.
అయితే, అంతమాత్రాన పార్టీని వీడాలనుకోవడం లేదన్నారు. ఐదేళ్లయినా, పదేళ్లయినా సతీష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని రమేశ్ జార్ఖిహొళి వివరించారు. నిజానికి జార్ఖిహొళి సోదరులు పార్టీ వీడితే ప్రభుత్వం ప్రమాదంలో పడేదే. అయితే.. వారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కుమారస్వామి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన చిక్కేమీ లేనట్టే.