ORR: 'ప్రగతి నివేదన' అనంతరం... 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

  • ఒకేసారి ఇంటిదారి పట్టిన 80 వేల వాహనాలు
  • ఔటర్ పై కదలని ట్రాఫిక్
  • ఈ మధ్యాహ్నానికి క్లియర్ చేస్తామంటున్న పోలీసులు

అట్టహాసంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ ముగిసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఇంటిదారి పట్టారు. కానీ, నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ కూడా ఔటర్ రింగ్ రోడ్డును దాటలేకపోయారు. దాదాపు 80 వేల వాహనాలు సభ ముగియగానే, తమ గమ్యానికి చేరేందుకు ఒకేసారి కదలడంతో, ఔటర్ పై సుమారు 100 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.

వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి, పరిస్థితి అస్యవ్యస్తం కాగా, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా అవస్థలూ పడ్డారు. సర్వీస్ రోడ్లు, ప్రత్యామ్నాయ రహదారులపై నుంచి ఒకేసారి వేలాది వాహనాలు రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్నో వాహనాల్లోని డ్రైవర్లు, ప్రజలు, ఓఆర్ఆర్ పైనే రాత్రంతా నిద్రించారంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కాగా, ఈ ఉదయానికీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరగలేదు. ట్రాక్టర్లను ఇంతవరకూ సభా ప్రాంగణం నుంచి కదిలేందుకు అనుమతించకపోయినా, మిగిలిన వాహనాలు ఔటర్ పై నెమ్మదిగా కదులుతున్నాయి. మధ్యాహ్నానికి ఔటర్, సర్వీస్ రోడ్లపై వాహనాల రద్దీని సాధారణ స్థితికి చేరుస్తామని పోలీసులు అంటున్నారు.

More Telugu News