Nandamuri Harikrishna: హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ.. ఆ నలుగురినీ ఉద్యోగం నుంచి తొలగించిన కామినేని ఆసుపత్రి

  • సోషల్ మీడియాలో వైరల్ అయిన సెల్ఫీ
  • మీడియాలో కథనాలు
  • క్షమాపణలు చెప్పి, ఉద్యోగాలు తీసేసిన కామినేని యాజమాన్యం

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకున్న నలుగురు సిబ్బందిపై వేటేసినట్టు కామినేని ఆసుపత్రి తెలిపింది. ఇది అమానుష, అనాగరిక ప్రవర్తన వల్ల జరిగిన తప్పిదమని, జరిగిన తప్పుకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు పేర్కొంది. ఆసుపత్రిలో ఉన్న హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ తప్పిదంలో పాల్గొన్న సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు స్పష్టం చేసింది. మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆసుపత్రిలోని కొందరి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఆసుపత్రి తరపున హరికృష్ణ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ నటుడు, రాజకీయవేత్త హరికృష్ణను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందిన అనంతరం ఆసుప్రతికి చెందిన ఇద్దరు వార్డు బాయ్‌లు, ఇద్దరు నర్సులు సెల్ఫీ తీసుకున్నారు. వీరిలో ఒకరు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయి చివరికి మీడియాకు చేరింది. సెల్ఫీపై పదేపదే కథనాలు ప్రసారం చేయడంతో స్పందించిన కామినేని ఆసుపత్రి యాజమాన్యం.. జరిగిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు తీసుకున్న నలుగురినీ తొలగించింది.

More Telugu News