Goa: ఆలయానికి వచ్చిన మహిళలను కౌగిలించుకుని లైంగికంగా వేధించిన పూజారి.. వేటేసిన ప్రభుత్వం!

  • ప్రార్థనల కోసం ఆలయానికి వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు
  • మహిళల  ఫిర్యాదుతో పరారీ
  • బెయిలు దరఖాస్తును తిరస్కరించిన కోర్టు

ప్రార్థనల కోసం ఆలయానికి వచ్చిన ఇద్దరు మహిళలను కౌగిలించుకుని ముద్దులు పెట్టి లైంగికంగా వేధించిన పూజారిని విధుల నుంచి తప్పిస్తూ గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బాధిత మహిళల ఫిర్యాదుతో పరారైన పూజారి తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

పోలీసుల కథనం ప్రకారం.. గోవాలోని మంగ్వేషి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ ఆలయంలో ధనంజయ్ భావే (51) పూజారిగా పనిచేస్తున్నాడు. ఆలయానికి వెళ్లిన తమను భావే కౌగిలించుకుని ముద్దులు పెట్టినట్టు ముంబైకి చెందిన ఇద్దరు మహిళలు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు నెలలుగా అతడు తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళల ఫిర్యాదు నేపథ్యంలో ప్రభుత్వం అతడిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాతి నుంచి అతడు అదృశ్యమయ్యాడు. అనంతరం బెయిలు కోసం జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకోగా తిరస్కరించింది. దీంతో గోవాలోని బాంబే హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించాడు. అక్కడా అతడికి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో చేసేది లేక మంగళవారం భావే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

More Telugu News