Social Media: ఓపక్క వరదలు.. మరోపక్క నకిలీ వార్తలు .. తల పట్టుకుంటున్న కేరళ ప్రభుత్వం!

  • సామాజిక మాధ్యమాల్లో కేరళ వరదలపై నకిలీ వార్తలు
  • తప్పుడు వార్తలతో తప్పుతోవ పట్టిస్తున్న కొందరు
  • తలనొప్పిగా భావిస్తున్నప్రభుత్వం

ప్రకృతి ప్రకోపం బారినపడి విలవిల్లాడుతున్న కేరళ ప్రజలకు సాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సామాజిక మాధ్యమాల్లోనే నకిలీ వార్తలు కూడా హల్‌ చల్ చేస్తుండడం తలనొప్పిగా మారింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో విపరీతంగా సర్క్యులేట్‌ అవుతున్న ఈ నకిలీ వార్తలను చూసి కేరళ ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ప్రమాదంలో చిక్కుకున్న ఓ వ్యక్తికి సహాయక సిబ్బంది లైఫ్‌ జాకెట్‌ అందించగా... అది కాషాయ రంగులో ఉందని తిరస్కరించి ప్రాణాలు పోగొట్టుకున్నాడని, దీంతో ముఖ్యమంత్రి విజయన్‌ ఆకుపచ్చ లైఫ్‌ జాకెట్లు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నది ఓ వార్తా కథనం. కానీ అది చివరికి ఫేక్‌ న్యూస్‌ అని తేలింది.

అలాగే, ‘ముల్లపెరియార్‌ డ్యామ్‌ లీకుల కారణంగా మరికొద్దిసేపట్లో కూలిపోయి ఎర్నాకుళం మునిగిపోబోతోంది, చుట్టుపక్కల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి’ అంటూ పీఎంఓలోని ఓ స్నేహితుడు తనకు తెలిపాడన్న మరో వీడియో క్లిప్‌ వైరల్‌గా మారి ప్రజల్లో భయభ్రాంతులకు కారణమైంది. దీంతో అదంతా ఫేక్‌ న్యూస్‌ అని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘కేరళలో ఓ రోజంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోందని, మీ సెల్‌ఫోన్‌లు చార్జి చేసుకోవాలంటూ మరో వార్త, భారత సైన్యం సహాయక చర్యల్ని కేరళ ప్రభుత్వం తిరస్కరించిందంటూ ఇంకోవార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇక ఒడిశాలో గతంలో వరదల్లో కొట్టుకు పోతున్న జింక పిల్లల వీడియోను కేరళలో జరిగినట్టుగా ఒక వార్త, కేరళ వరద బాధితులంతా ధనిక కుటుంబాల వారే అని ఓ బీజేపీ కార్యకర్త ట్వీట్‌ చేసినట్టు చెబుతున్న మరో వార్త, వరద నీటిలో మునిగిపోయిన కార్ల ఫొటో.. ఇవన్నీ నకిలీవని తేలింది. ఇక, శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడమే ఈ కల్లోలానికి కారణం అంటూ కొందరు ఛాందసవాదులు కామెంట్లు చేయడం మరో చర్చకు తావిస్తోంది.

More Telugu News