Warangal Urban District: ఆమ్రపాలి 'దెయ్యం' వ్యాఖ్యలతో అధికారుల్లో తీవ్ర కలకలం!

  • 13 దశాబ్దాల క్రితం నిర్మితమైన భవనం
  • పై అంతస్తులో నిద్రించేందుకు భయమన్న ఆమ్రపాలి
  • దెయ్యం ఉందని పూర్వపు కలెక్టర్లు చెప్పారనడంతో ఉద్యోగుల్లో భయం

వరంగల్ నడిబొడ్డున దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో, ఎత్తయిన చెట్లు, నిండైన పచ్చదనం మధ్యలో ఉండే రెండు అంతస్తుల భవంతిగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంపై ఇప్పుడు ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ భవంతి తొలి అంతస్తులో దెయ్యం ఉందని పూర్వపు కలెక్టర్లు తనకు చెప్పారని, అందువల్ల తాను అక్కడ పడుకునేందుకు భయపడుతున్నానని కలెక్టర్ ఆమ్రపాలి స్వయంగా వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపగా, కలెక్టరేట్ సిబ్బందితో పాటు, అధికారులు సైతం భయపడుతున్నారు.

దాదాపు 13 దశాబ్దాల క్రితం, బ్రిటీషర్ల ఏలుబడిలో ఇండియా ఉన్న వేళ, చెక్క దూలాలతో ఈ భవంతిని నిర్మించారు. ఓ పురాతన బావి కూడా ఇక్కడ ఉంది. పలు పురాతన శిల్పాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ భవనంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, తానెంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంటిని వదిలి ఉండలేని బ్రిటీష్ ఇంజనీర్ జార్జ్ పామర్ భార్య ఇదే భవంతిలో ఇప్పటికీ ఆత్మగా ఉంటోందని తాము అనుకుంటున్నామని సమీప ప్రాంతాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయన్న విషయాన్ని పక్కనబెడితే, తెలుగు టీవీ చానళ్లు ఆమ్రపాలి వ్యాఖ్యలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తూ, ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి.

More Telugu News