New Delhi: విచిత్రం అంటే ఇదే మరి! 121 మంది పోలీసులపై అవినీతి ఆరోపణలు.. అందరూ నీతిమంతులేనట!

  • ‘అవినీతి’ పోలీసుల కేసు విచారణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్
  • 121 మందిపై ఆరోపణలు.. 18 మంది అరెస్ట్.. దోషులు సున్నా
  • ఆశ్చర్యపరుస్తున్న ఢిల్లీ పోలీసుల తీరు

 అవినీతికి పాల్పడి దొరికిపోయిన పోలీసుల కేసుల విచారణ కోసం ఢిల్లీ పోలీసు అధికారులు 2014లో ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అవినీతికి పాల్పడిన 121 మంది పోలీసులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 18 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే, వీరిలో ఒక్కరిని కూడా దోషిగా నిరూపించలేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 ఆగస్టు 1 వరకు మొత్తం అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులపై 66 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఎస్సైలు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. చాలా కేసుల్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉండడం గమనార్హం.

మొత్తం నమోదైన కేసుల్లో కేవలం 14 శాతం మందినే ఎందుకు అరెస్ట్ చేశారన్న ప్రశ్నకు విజిలెన్స్ యూనిట్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే తప్ప అరెస్ట్ చేయలేమని తేల్చేశారు. పక్కా సాక్ష్యాధారాలు ఉంటేనే వారిని అదుపులోకి తీసుకోగలమని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం నమోదైన కేసుల్లో కూడా ఇంకా ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే అరెస్ట్ చేయగలమని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 1800 మంది పోలీసులపై డిపార్ట్‌మెంటల్ దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. 

More Telugu News