Chandrababu: సీఎం చంద్రబాబును కలసిన ఉండవల్లి.. ఏకాంతంగా చర్చ!

  • చంద్రబాబు, నేను ఏకాంతంగా చర్చించాం
  • పార్లమెంట్ లో ఎలా పోరాడాలో కొన్ని సలహాలు ఇచ్చా
  • విభజన తీరుపై నేను రాసిన పుస్తకం బాబుకు అందజేశా

ఏపీ సీఎంఓ ఆహ్వానం మేరకు ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు వెలగపూడి సచివాలయానికి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో ఉండవల్లి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం, మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ, ‘చంద్రబాబు, నేను ఏకాంతంగా చర్చించాం. విభజన హామీలు, పార్లమెంట్ లో పోరాటంపై చంద్రబాబుకు గతంలో నేను రాసిన లేఖపై ఆయన చర్చించారు.  

2014 ఫిబ్రవరి 18న చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంట్ హౌస్ లో జరిగిన నిర్ణయాలపై కోర్టు కల్పించుకోలేదు. చట్టబద్ధంగా జరగని విభజనపై కోర్టుకు వెళ్లాం. విభజన బిల్లును తలుపులు మూసి ఆమోదించారని గతంలో మోదీ అన్న విషయాన్ని ప్రస్తావించా. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని, విభజన చట్టవిరుద్ధమని పేర్కొంటూ పార్లమెంటులో చర్చకు నోటీసు ఇవ్వమని చెప్పా.

పార్లమెంట్ లో అనుసరించాల్సిన తీరుపై, ఎలా పోరాడాలో కొన్ని సలహాలు ఇచ్చా.. నిర్ణయం వారిదే. రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. నేను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల ప్రతులను చంద్రబాబుకు అందజేశా. అలానే, విభజన తీరుపై నేను రాసిన పుస్తకాన్నీ అందజేశాను. నేను ఏ పార్టీలో లేను.. ఏ పార్టీలోనూ చేరను’ అని చెప్పారు.  

More Telugu News